Thursday, May 20, 2010

చీకటి మనసు



చీకటికి కూడా మనసుంటుంది. ఓపిగ్గా ప్రతీ రాత్రి  మన బాధల్నివింటుంది ఒక స్నేహితుడు/స్నేహితురాలిలా. సంతోషాల్ని చూస్తూ.....ఉంటుంది ప్రేక్షకపాత్రను కూడా పోషిస్తూ. రేపటి లక్ష్యాలకు ప్రేరణ అది, నేటి తీపి-చేదు అనుభవాలకు, ఆత్మ విశ్లేషణలకు, విమర్శలకు, ఎన్నో ఆశలకు వేదిక ఇది. ఎన్నో కలలకు వెండి తెర, ఎన్నెన్నో 'కష్ట -సుఖాలకు' హేతువు అది. నక్షత్రాలతో సమానంగా మిణుగురులకు కూడా తనలో  స్థానం కల్పిస్తుంది. ఎన్నో నిశాచర జీవుల గొంతుల్ని వింటుంది. కీచురాళ్ళ శబ్దాలనయినా శ్రావ్యంగా మనకు వినిపిస్తుంది.ఎంత విశాలత్వం దానిది! కానీ దానికి వెలుతురులా జన్మ స్థానం(సూర్యుడు) లేదు, జనం దాన్ని పూజించరు.  ఐన అది విశ్రాంతి, విరామాలను, సుఖ-శాంతులను ఇస్తుంది మనకు. దానికో రంగు, రూపు లేదు , అయినా అన్ని రంగులను తనలో కలుపుకోగలదు, అన్ని రూపాలను అదృశ్యం చేయగలదు.  అయ్యో ఈరోజు సగం ఉన్నాడే అని బాధ పడదు, నిండు చంద్రుడైన, నెలవంకైన దానికి ఒకటే . అద్భుతమైన సమానత్వ సిద్ధాంతం దానిది.  జీవితంలోకష్ట-సుఖల్లాగే వెలుగు-చీకట్లు రోజులో బాగం. ఎందుకో కానీ అలాంటి చీకటిని దుష్ట శక్తిలా చిత్రీకరించింది మన సాహిత్యం.   

Thursday, April 1, 2010

అతడే!!

అన్నింటిలో అతడే ఉన్నపుడు, కొన్నింటిలో వెతుక్కోవడమెందుకు?
రాయి కూడా అతడే ! రాయిని కూడా సృష్టించిన చేయి అతనిదే !!
రాయి నుండి విగ్రహమై పూజింపబడేది అతడే!
పువ్వూ అతడే, పువ్వై వికసిస్తూ, పరిమళిస్తూ,
పూల కోసం ఆశపడేది అతడే!!
అయినా అతన్ని కొన్ని ప్రాంతాలకే, కొన్ని పేర్లకే కట్టడి చేస్తున్నాం!  
పెంచికలపేట  కాళికాదేవి గా,  ఈజ్ గాం మల్లన్నగా, బాసర సరస్వతిగా, చాందా మహంకాళిగా, గూడెం గుట్ట సత్యనారాయణగా ,  ఎములాడ రాజన్నగా, కొండగట్టు అంజన్నగా, తిరుపతి వెంకన్న గానే అతన్ని ఎందుకు పరిమితం చేద్దాం. అతడు సర్వాంతర్యామి, అన్ని ప్రాణులను సృష్టిస్తూ, పోషిస్తూ, తనలోనే విలీనం చేసుకుంటున్నాడు. మనుషుల్లాగా ప్రేమను పరిమితం చేయడు. అతని ప్రేమ అపరిమితమైనది. అనంతమైనది. అది విశ్వప్రేమ. అతనికి బేధభావం లేదు.  అతని హృదయం విశాలం, నిర్మలం, అమృతం. అందుకే అతడు దేవుడు. అతడు ప్రజాస్వామ్యవాది. ఎలాంటి ఆంక్షలు విధించకుండానే, వంద సంవత్సరాల జీవితాన్ని, అద్భుతమైన తెలివితేటలను, విచక్షణను..సంతోషంగా జీవించడానికి అవసరమైన వాటినన్నంటిని ప్రసాదిస్తూ, ఈ భూమి పై కి వదులుతాడు. మన నాటకాలన్నీ మౌనంగా వీక్షిస్తాడు.
అతనికి రూపం లేకపోవడం మనకు శాపం. లేదంటే అయ్యో దేవుడు చూస్తున్నాడు అని కొన్ని తప్పులనైన  చేయకుండా ఉండేవాళ్ళం కదా!! మనం భౌతికతకు అలవాటుపడ్డాం. ఇంకో రకమైన ఉనికి ఉండదనే భ్రమలో జీవిస్తున్నాం. ఉన్నదని తెల్సిన నమ్మకూడదని నిర్ణయించుకున్నాం. ఇది సంకుచితత్వం. మన దృష్టి, ఆలోచన విధానం పరిమితం. మన ప్రవర్తన అప్రజాస్వామ్యం. ఎంతటి ఘోరం. నేరం. కళ్ళు కేవలం వాటికి కనబడే వాటినే చూపించగలవు. వాటి దృష్టి పరిమితం. మనసు తను కోరుకొనే దాన్నే లేదా తన అనుభవంలోకి వచ్చిన వాటినే నమ్ముతుంది. దాని శక్తి కూడా పరిమితమైనదే. కొన్ని గొప్ప విషయాలను తెల్సుకోవాలంటే, గొప్ప వ్యక్తుల సహాయం కావాలి. మనకు మనంగా అన్నింటిని తెల్సుకోలేం. అందుకే శాస్త్రాలు వచ్చాయి. శాస్త్రజ్ఞులు పుట్టుకొచ్చారు. 'అజ్ఞాత జ్ఞాపకం హి శాస్త్రం'. మనకు మనం గా  తెల్సుకోలేని దాన్ని చెప్పేదే శాస్త్రం. నీటి బొట్టులో రెండు హైడ్రోజన్, ఒక ఆక్షిజన్ అణువులు ఉంటాయని ఎవరు చెప్పారు? మనం రోజూ నీళ్ళను ఉపయోగిస్తూనే ఉన్నాం, కానీ ఎవరో ఒకరు చెప్పేవరకు తెల్సుకోలేకపోయాం. గాలిని పీలుస్తూనే ఉన్నాం, కానీ ఆ గాలిలోనే సెల్ ఫోన్ కి, టెలివిజన్ కి కావాల్సిన తరంగాలు ఉంటాయని తెలియదు. వీటిని తెల్సుకోవడం కోసమే ఎన్నో పుస్తకాలను చదువుతున్నాం. అలాంటిది దేవుణ్ణి తెల్సుకోవడం కోసం సంబందిత  పుస్తకాలు చదువుకోవచ్చు కదా ! ఆ పని చేయం. ఊరికే గంటల తరబడి వాదిస్తాం. ఏం లాభం ? భారతదేశం ఎన్నో మతాలకు నిలయం. ఎవరి మతం వాళ్ళు, వాళ్ళ మత గ్రంధాలను కొన్నిటిని అయినా చదివే ప్రయత్నం చేస్తే తప్పేంటి? అన్ని మతాలూ దేవుణ్ణి నిర్వచించే ప్రయత్నమే చేసాయి, దైవత్వాన్ని పొందటానికి ఎన్నో దారులను, పద్దతులను, ఆచారాలను సూచించాయి. దేవునికి, మనషికి మధ్య అంతరాన్ని(వాస్తవానికి అది లేదు) తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషుల్ని దేవునిగా తీర్చి దిద్దేవిగానే ఉన్నాయని ఘాడంగా నమ్ముతాను. హిందూ మతంలో  ఐతే "అహం బ్రహ్మస్మి సోహం శివోహం" అంటే ఆత్మ- పరమాత్మా ఒకటే అని నొక్కి చెప్పబడింది. "జీవో దేవస్సనాతనః" అంటే 'సనాతనంగా జీవం ఉన్న ప్రతిదీ దేవుడే' అని కూడా వేదాల్లో ఉంది. ఐన దేవుడు అనగానే అదేదో మనకు సంబంధం లేనిది గా భావిస్తాం. అతన్ని మన నుండి దూరం చేసుకొని జీవిస్తున్నాం. అతన్ని గుర్తించలేక పోతున్నాం. మన దృష్టిలో, మనస్సులో లోపం ఉంది.ఎక్కడో ఉన్నాడని వెళ్తున్నాం. ఎంత దౌర్భాగ్యం! మనలోనూ, ప్రతీ వ్యక్తిలోనూ, ప్రతీ ప్రాణిలోనూ అతడు ఉన్నాడని భావించడమే మన విధి, దిన్ని తెల్సుకోవడం మన లక్ష్యం. అదే అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం ప్రతీ ఒక్కరికి ఉంటే ప్రపంచం అంతా సుఖ-శాంతులతో విరాజిల్లుతుంది.

"కృష్ణస్తు భగవాన్ స్వయం" కృష్ణుడు స్వయంగా దేవుడు ఎందుకంటే  మానవాళి క్షేమం కోసం ఇలాంటివి ఎన్నో భగవద్గీత లో చెప్పాడు.                                                              

ఏమంటారు?

Wednesday, March 31, 2010

"నిజాం కు ఘోరి కడితే!!!

 "నిజాం కు ఘోరి కడితే న్యాయం జరిగిందా మనకు ! అన్యాయమే(నా) బ్రతుకంతా అడిగుతోంది తెలంగాణా !" అని 'బతుకమ్మ' సినిమాలో అందెశ్రీ పాట రాసుకున్నాడు. అవును అన్యాయం, నిరంకుశత్వం రూపం మారింది, తరతరాలుగా కొనసాగుతోంది. అది సీమాంధ్రకు చెందిన కొందరు వ్యక్తులు అని నిర్మొహమాటంగా తెలంగాణకు చెందిన స్కూలుకు పోయే పోరడు కూడా చెప్తడు.  తెలంగాణా యాస లో మాట్లాడితే కింది నుండి పైదాక చూస్తారు కొందరు, అదేదో నేరం అయినట్టు. ఇటు తెలంగాణాలో నాణ్యమైన విద్యకు సదుపాయాలు సరిగ్గా లేవు, ఈ ప్రాంతం ఇంగ్లీషు వాళ్ళ చేత పాలించబడలేదు, క్రిస్టియన్ మిషినరీస్ లేవు. ఉన్నదల్లా నిరంకుశ నిజాం ప్రభుత్వాలు, ఉర్దూ మీడియం స్కూళ్ళు, అపుడు బలవంతంగానే మాది కాని భాషను నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా అంతే, మావి కాని వాటిని ఎన్నింటినో నేర్చుకుంటున్నాం. మా సంస్కృతి కల్తీ అయింది. ఉనికినే కోల్పోతోంది.  మమ్మల్ని మేం ఏవిదంగా ఎదుటివాళ్ళకు చెప్పుకోవాలో తెలియని అసహాయస్థితి. ఇది అస్థిత్వాన్ని కాపాడుకోవాలనుకొనే ఆరాటం. పోరాటం. ఇపుడు మా యాస రోతగానే ఉంటుంది,మా సంస్కృతి వికారంగానే ఉంటుంది. అవును వాళ్ళకు పెద్ద, పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, వ్యవసాయంలో లాభాలు పెరిగాయి, ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించారు, ప్రసార మాధ్యమాలు స్థాపించారు, వాళ్ళ భాషనే ప్రామాణికమైనదిగా, వాళ్ళ సంస్కృతినే ఉత్తమమైనదిగా  ప్రచారం చేయడం మొదలుపెట్టారు, తెలంగాణా భాషను, సంస్కృతిని హీనమైనదిగా చిత్రీకరించారు. ఇది హింస. భాష, సాంస్కృతికపరమైన హింస, మానసిక హింస కాదా? మాకంటూ ఒక సంస్కృతి లేదా? దాన్ని గౌరవించాల్సిన భాద్యత ఆంధ్ర వాళ్ళకు లేదా? సాంస్కృతిక, నాగరికతపరమైన అంతరాలు పెరిగిపోయే ప్రమాదాన్ని విలీనం చేసేటపుడు పెద్ద మనుషులు ఉహించాలేదా? మొదట్లోనే ఆ అంతరాల్ని తగ్గించే ప్రయత్నాన్ని ఎవరూ ఎందుకు చేయలేదు? విలీనం వెనుక దాగి ఉన్న ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి అనే నమ్మకం రాగానే సంస్కృతీ, నాగరికతల గోల ఎందుకని వదిలేశారా? విలీనం రాజకీయంలో బాగం  కాదా? రాజకీయ కుట్ర కాదా? అది రాజకీయ నిరుద్యోగులది కాదా?  అపుడు ఎవరి ఏకాభిప్రాయంతో ఈ మోసానికి ఒడిగట్టారు? ఏ ప్రాంత ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరారు?  ఏ అసెంబ్లీ లో  తీర్మానం ప్రవేశ పెట్టారు? ఎంత మెజారిటీతో ఆమోదించారు? ఎవరి అనుమానాలను నివృత్తి చేశారు?
రాజకీయవాదులు ఇలాంటి అంతరాలను తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటే తప్పేంటి? అది రాజకీయాల్లో ఒక బాగం. సహజంగానే రాజకీయ నాయకులు ఇలాంటి అవకాశాలు, అంతరాల కోసమే ఎదురు చూస్తారు లేదా సృస్టిస్తారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఇంతదాకా వచ్చింది? కారకులు ఎవరు? వాళ్ళకి శిక్ష ఏంటి? విలీనంతో తెలంగాణా ఎంత మూల్యం చెల్లించిందో ఏ కమిటి నిర్ధారణ చేయగలదు? ఆ నివేదికలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోగలవు?
        అసలు తెలంగాణా -ఆంధ్ర సమస్యను "జాతుల పోరాటం"గా వర్ణించాడు ఈ మధ్య ఒక మహానుభావుడు. అపుడు బలవంతంగానే మాటలు కలిసాయి, మనస్సులో ఏదో తెలియని అసౌకర్యం. భాషలో సారుప్యత ఉన్నా, యాస లో ఎంతో తేడా ఉంది. తెలుగు భాషగా ఉండటం తెలంగాణా వాళ్ళ పాలిట శాపమైంది. అది ఎన్ని దశాబ్దాల తర్వాత విమోచనం అవుతుందో ఎవరు మాత్రం ఉహించగలరు? 'చీమ చిటుక్కుమన్నా హైకమాండ్ కు   విన్నవించుకొని, అక్కడి నుండి వచ్చే ఆజ్ఞ తర్వాతే ఏదైనా చేసే నీచ రాజకీయవాదులను మనం ఎన్నుకుంటున్నామా? అని ప్రజల్లో ఎప్పుడు చైతన్యం వస్తోందో అని ఎదురుచూస్తున్నా! ఇది మన సమస్య మనమే ఎందుకు పరిష్కరించుకోలేం అనే విచక్షణ మన ప్రజా ప్రతినిధులకు ఎపుడు వస్తుందో అని కూడా ఎదురుచూస్తున్నా!
చివరగా, ఎన్నో పోరాటాల చరిత్ర, స్పూర్తి కలిగిన తెలంగాణా  మనది. దాన్ని పూర్తిగా చదువుదాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా విద్యార్ధి సోదర, సోదరీమణుల్లారా ! ఆత్మ హత్య ల సంస్కృతి మనది కాదు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులకైన, నిరంకుశ ధోరణులకైనా ఎదురునిల్చి పోరాడిన చరిత్ర మనది. పోరాటం మన నైజం. ఒక్కొక్కరైనా సరే బ్రతికి పోరాడి భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్నిద్దాం. 
 ----DSTలో బతుకమ్మ సినిమాచూసాక రగిలినస్పూర్తితో..!!

                                                                                                   

Tuesday, March 30, 2010

ప్రేమ మరియు పెళ్లి

'ప్రేమ' అనేది  యువతను ఎప్పటికి ఉల్లాసపరిచేదే. ఆ పదంలోనే ఏదో మత్తు దాగి ఉన్నట్టుంది. దాని గురించి మాట్లాడుకోవడం అన్నా, వినడం, చదవడం అన్నా ఆసక్తిగానే ఉంటుంది.   ప్రేమను మొదలు పెట్టడం సులభం, కానీ దాన్ని నిలుపుకోవడం అనేది మాత్రం ఒక కళ. ఈ మధ్య, ప్రేమించుమనో, ప్రేమిస్తున్న అమ్మాయి దక్కలేదనో, కొందరు యువకులు హింసాత్మక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది ఆధునిక సమాజానికి మచ్చ లాంటిది, అభ్యున్నతికి అవరోధం కుడా.  'ప్రేమ' అనే ప్రయాణంలో పెళ్లి ఒక మలుపు లాంటిదే కానీ అదే గమ్యం కాదు అని నా అభిప్రాయం. ''సఫలం అయిన ప్రేమ పెళ్లి వరకు, విఫలం అయిన ప్రేమ చితి వరకు" అని తనికెళ్ళ భరణి గారు అన్నట్టు, పెళ్లి మాత్రమే పరమావధి కాకూడదు. కొన్ని సామజిక లేక వేరే ఇతర కారణాల వల్లనో ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ వారి ప్రేమను ఎవరు, ఏ శక్తి అడ్డుకోగలదు? ప్రేమ అనేది మనస్సుకు సంబంధించింది.  ప్రేమ తర్వాత  పెళ్లి అనేది కేవలం ఒక సంఘటనగా అభివర్ణిస్తాను. అది జరిగినా , జరుగక పోయినా ప్రేమ జీవనదిలా మనసులో ప్రవహిస్తూ ఉండాలి. దేన్నీ ఆశించకుండా, అనునిత్యం, ఎదుటి వ్యక్తి క్షేమం కోరేదే ప్రేమంటే. ప్రస్తుత సమాజంలోని చాలా మంది యువకులు ప్రేమంటే తమ ప్రియురాలిని సొంతం చేసుకోవడం లేదంటే, కాదంటే, అంతం చేయడం అని భావిస్తున్నారు, బ్రమల్లో జీవిస్తున్నారు. నిజానికి మన సాహిత్యం, ప్రసార మాధ్యమాలు ప్రేమకు సరైన నిర్వచనాన్ని ఇవ్వడంలో  విఫలం అయ్యాయి అనే చెప్పుకోవాలి. లేదంటే ప్రేమించే అమ్మాయిపై  పలురకాల దాడులకు దిగడం అనే ఆలోచనావిధానం ఎక్కడి నుండి వచ్చింది? విచక్షణ అనే దాన్నే మరిచిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మన కుటుంబం లో జరిగితే తట్టుకోగలమా ! భావి భారత పౌరుల్లారా ఇక ముందైన మనం మనుషుల్లాగా వ్యవహరిద్దాం, కొన్ని మానవ విలువల్ని భావి తరాల కోసం కాపాడుదాం !!
ఏమంటారు ?! 

Saturday, April 18, 2009

చాలా రోజుల తరువాత తెలుగులో బ్లాగింగ్ చేయడం నేర్చుకున్నా...ఇది నా మొదటి ప్రయత్నం ..
ఇక నుంచి, నా నుంచి కొన్ని కొత్త విషయాలు తెల్సుకుంటారు మీరంతా ..అది కూడా రెండు, మూడు పంక్తుల్లోనే..