అన్నింటిలో అతడే ఉన్నపుడు, కొన్నింటిలో వెతుక్కోవడమెందుకు?
రాయి కూడా అతడే ! రాయిని కూడా సృష్టించిన చేయి అతనిదే !!
రాయి నుండి విగ్రహమై పూజింపబడేది అతడే!
పువ్వూ అతడే, పువ్వై వికసిస్తూ, పరిమళిస్తూ,
పూల కోసం ఆశపడేది అతడే!!
అయినా అతన్ని కొన్ని ప్రాంతాలకే, కొన్ని పేర్లకే కట్టడి చేస్తున్నాం!
పెంచికలపేట కాళికాదేవి గా, ఈజ్ గాం మల్లన్నగా, బాసర సరస్వతిగా, చాందా మహంకాళిగా, గూడెం గుట్ట సత్యనారాయణగా , ఎములాడ రాజన్నగా, కొండగట్టు అంజన్నగా, తిరుపతి వెంకన్న గానే అతన్ని ఎందుకు పరిమితం చేద్దాం. అతడు సర్వాంతర్యామి, అన్ని ప్రాణులను సృష్టిస్తూ, పోషిస్తూ, తనలోనే విలీనం చేసుకుంటున్నాడు. మనుషుల్లాగా ప్రేమను పరిమితం చేయడు. అతని ప్రేమ అపరిమితమైనది. అనంతమైనది. అది విశ్వప్రేమ. అతనికి బేధభావం లేదు. అతని హృదయం విశాలం, నిర్మలం, అమృతం. అందుకే అతడు దేవుడు. అతడు ప్రజాస్వామ్యవాది. ఎలాంటి ఆంక్షలు విధించకుండానే, వంద సంవత్సరాల జీవితాన్ని, అద్భుతమైన తెలివితేటలను, విచక్షణను..సంతోషంగా జీవించడానికి అవసరమైన వాటినన్నంటిని ప్రసాదిస్తూ, ఈ భూమి పై కి వదులుతాడు. మన నాటకాలన్నీ మౌనంగా వీక్షిస్తాడు.
అతనికి రూపం లేకపోవడం మనకు శాపం. లేదంటే అయ్యో దేవుడు చూస్తున్నాడు అని కొన్ని తప్పులనైన చేయకుండా ఉండేవాళ్ళం కదా!! మనం భౌతికతకు అలవాటుపడ్డాం. ఇంకో రకమైన ఉనికి ఉండదనే భ్రమలో జీవిస్తున్నాం. ఉన్నదని తెల్సిన నమ్మకూడదని నిర్ణయించుకున్నాం. ఇది సంకుచితత్వం. మన దృష్టి, ఆలోచన విధానం పరిమితం. మన ప్రవర్తన అప్రజాస్వామ్యం. ఎంతటి ఘోరం. నేరం. కళ్ళు కేవలం వాటికి కనబడే వాటినే చూపించగలవు. వాటి దృష్టి పరిమితం. మనసు తను కోరుకొనే దాన్నే లేదా తన అనుభవంలోకి వచ్చిన వాటినే నమ్ముతుంది. దాని శక్తి కూడా పరిమితమైనదే. కొన్ని గొప్ప విషయాలను తెల్సుకోవాలంటే, గొప్ప వ్యక్తుల సహాయం కావాలి. మనకు మనంగా అన్నింటిని తెల్సుకోలేం. అందుకే శాస్త్రాలు వచ్చాయి. శాస్త్రజ్ఞులు పుట్టుకొచ్చారు. 'అజ్ఞాత జ్ఞాపకం హి శాస్త్రం'. మనకు మనం గా తెల్సుకోలేని దాన్ని చెప్పేదే శాస్త్రం. నీటి బొట్టులో రెండు హైడ్రోజన్, ఒక ఆక్షిజన్ అణువులు ఉంటాయని ఎవరు చెప్పారు? మనం రోజూ నీళ్ళను ఉపయోగిస్తూనే ఉన్నాం, కానీ ఎవరో ఒకరు చెప్పేవరకు తెల్సుకోలేకపోయాం. గాలిని పీలుస్తూనే ఉన్నాం, కానీ ఆ గాలిలోనే సెల్ ఫోన్ కి, టెలివిజన్ కి కావాల్సిన తరంగాలు ఉంటాయని తెలియదు. వీటిని తెల్సుకోవడం కోసమే ఎన్నో పుస్తకాలను చదువుతున్నాం. అలాంటిది దేవుణ్ణి తెల్సుకోవడం కోసం సంబందిత పుస్తకాలు చదువుకోవచ్చు కదా ! ఆ పని చేయం. ఊరికే గంటల తరబడి వాదిస్తాం. ఏం లాభం ? భారతదేశం ఎన్నో మతాలకు నిలయం. ఎవరి మతం వాళ్ళు, వాళ్ళ మత గ్రంధాలను కొన్నిటిని అయినా చదివే ప్రయత్నం చేస్తే తప్పేంటి? అన్ని మతాలూ దేవుణ్ణి నిర్వచించే ప్రయత్నమే చేసాయి, దైవత్వాన్ని పొందటానికి ఎన్నో దారులను, పద్దతులను, ఆచారాలను సూచించాయి. దేవునికి, మనషికి మధ్య అంతరాన్ని(వాస్తవానికి అది లేదు) తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషుల్ని దేవునిగా తీర్చి దిద్దేవిగానే ఉన్నాయని ఘాడంగా నమ్ముతాను. హిందూ మతంలో ఐతే "అహం బ్రహ్మస్మి సోహం శివోహం" అంటే ఆత్మ- పరమాత్మా ఒకటే అని నొక్కి చెప్పబడింది. "జీవో దేవస్సనాతనః" అంటే 'సనాతనంగా జీవం ఉన్న ప్రతిదీ దేవుడే' అని కూడా వేదాల్లో ఉంది. ఐన దేవుడు అనగానే అదేదో మనకు సంబంధం లేనిది గా భావిస్తాం. అతన్ని మన నుండి దూరం చేసుకొని జీవిస్తున్నాం. అతన్ని గుర్తించలేక పోతున్నాం. మన దృష్టిలో, మనస్సులో లోపం ఉంది.ఎక్కడో ఉన్నాడని వెళ్తున్నాం. ఎంత దౌర్భాగ్యం! మనలోనూ, ప్రతీ వ్యక్తిలోనూ, ప్రతీ ప్రాణిలోనూ అతడు ఉన్నాడని భావించడమే మన విధి, దిన్ని తెల్సుకోవడం మన లక్ష్యం. అదే అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం ప్రతీ ఒక్కరికి ఉంటే ప్రపంచం అంతా సుఖ-శాంతులతో విరాజిల్లుతుంది.
"కృష్ణస్తు భగవాన్ స్వయం" కృష్ణుడు స్వయంగా దేవుడు ఎందుకంటే మానవాళి క్షేమం కోసం ఇలాంటివి ఎన్నో భగవద్గీత లో చెప్పాడు.
ఏమంటారు?
